Telugu

ది కాకినాడ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్  నెంబర్ 8979., కాకినాడ గురించి క్లుప్తంగా:- 

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో 1923 అక్టోబర్ 12న రిజిస్టర్ కాబడిన ది కాకినాడ కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్, కాకినాడలో ప్రారంభించి బడుగు, బలహీనవర్గాలకు, మధ్యతరగతి ఉన్నత వర్గాలకు గృహ అవసరాలు తీర్చి గ్రామీణ గృహ అభివృద్ధి ఉద్దేశ్యంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంస్థను స్థాపించడం జరిగినది. గృహ నిర్మాణానికి ప్రభుత్వమే రుణాలు మంజూరు చేస్తూ ఉండేది. భారతదేశ స్వాతంత్ర అనంతరం అప్పటి కలెక్టర్, పట్టణ  ప్రముఖులైన శ్రీ కొమ్మిరెడ్డి సూర్యనారాయణ మూర్తి గారిని ఈ సంస్థ కార్యకలాపాల  పర్యవేక్షకునిగా నియమించినారు. 

1950వ సంవత్సరం రిపబ్లిక్ అనంతరం మొట్టమొదటి  సారిగా  ఎన్నికలు జరిగి శ్రీ కోసూరి కృష్ణారావు గారు తొలి సంఘ అధ్యక్షునిగా ఎన్నికైనారు.  అప్పటి మద్రాస్  ప్రెసిడెన్సీ లో ఉన్న సహకార విధానాలని అనుసరిస్తూ, పట్టణ గ్రామీణ గృహ నిర్మాణ అవసరాలకు ప్రభుత్వ నిధుల నుండి రుణములు  మంజూరు చేయడం జరిగేది. 1964లో ప్రభుత్వ సహకార చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం పరిధిలో నమోదు కాబడి ఇప్పటికీ అదే చట్టపరిధిలో ఈ సంఘ కార్యకలాపములు నిర్వహించుట జరుగుచున్నది. 

 1971 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార గృహ నిర్మాణ సంఘాల సమాఖ్య (ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్) రాష్ట్రములో ప్రాథమిక గృహనిర్మాణ సంఘములకు మూకుమ్మడిగా   నిధులు సేకరించి మంజూరు చేసే ముఖ్య లక్ష్యంతో ఏర్పడినది.  ఈ సమాఖ్య ఏర్పడుటలో కీర్తిశేషులు శ్రీ కోసూరి కృష్ణారావు గారి పాత్ర విశిష్టమైనది.  ఈయన హౌస్ ఫెడ్ కు వైస్ చైర్మన్ గా  వ్యవహరించడం కూడా జరిగినది.  ఈ సమాఖ్య ఎల్ఐసి వారి నుండి హెచ్చు మొత్తంలో రుణములు  సేకరించి ప్రాథమిక సహకార సంఘాలకు 1% మార్జిన్తో సంఘ సభ్యులకు ఎల్ఐజి, ఎంఐజి మరియు హెచ్ఐజి  అను మూడు వర్గాలు వారికి రుణములు మంజూరు చేసేది.  ఈ సమాఖ్య కు ది కాకినాడ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అనుసంధానమై కాకినాడ పట్టణ మరియు చుట్టుప్రక్కల 63 గ్రామాల సభ్యులకు రుణాలు మంజూరు చేస్తూ 1985 నాటికి లావాదేవీలు  నాలుగు కోట్లుకు  చేరుకుని రాష్ట్రంలోనే అగ్రగామి సంస్థగా పేరుపొందినది.  అయితే 1985 సంవత్సరం అనంతరం ఎల్ఐసి మరియు బ్యాంకులు గృహ నిర్మాణమునకు నేరుగా రుణములు మంజూరు చేయుట ప్రారంభించినారు .  ఏకఛత్రాధిపత్యంగా విరాజిల్లుతున్న సహకార ఉద్యమానికి గట్టి పోటీ ఏర్పడినది.  మూడు అంచెలుగా రుణాలు మంజూరు చేసే ఈ సహకార వ్యవస్థ ఒకేసారి, ఒకే కార్యాలయం నందు రుణములు మంజూరు చేసే ఎల్ఐసి మరియు బ్యాంకుల ధాటికి  నిలువలేక రాష్ట్రవ్యాప్తంగా సహకార గృహనిర్మాణ సంస్థలన్నీ నీరు గారి నత్తనడక అవలంబించడం మొదలైనది.  పెరుగుతున్న ఖర్చులు తరుగుతున్న వ్యాపారము రాష్ట్రవ్యాప్తంగా ఈ సహకార ఉద్యమాన్ని మట్టుపెట్టే వాతావరణం కమ్ముకుంది.  అటువంటి తరుణంలో సంస్థ అధ్యక్షులు  శ్రీ కోసూరి  కృష్ణారావు గారు మే నెల 1995వ సంవత్సరములో హఠాత్తుగా మరణించుట సంస్థను దిగ్భ్రాంతి కి గురిచేసింది . 

 ఈ  తరుణంలో ఆయన కుమారులు  శ్రీ కోసూరి యదు సూర్య  గారు అధ్యక్షుడిగా కోఆప్ట్  కాబడి బాధ్యతలు స్వీకరించి సంఘ ఆర్థిక, వ్యవస్థాగత రాజకీయ పరిస్థితులను గమనించి ఆయన సభ్యుల నుండి డిపాజిట్స్ సేకరించి స్వయంగా గృహ నిర్మాణానికి, మరమ్మత్తులకు, కొనుగోళ్లకు, అపార్ట్మెంట్లు నిర్మాణానికి మరియు అభివృద్ధికి రుణములు  మంజూరు చేసినచో ఆర్థిక పటిష్టతను, స్వయంప్రతిపత్తిని సాధించగలమని అప్పటి “బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్” యొక్క అంగీకారంతో సంఘములో  దానికి అనుగుణంగా భైలాలలో మార్పులు చేసి 1996వ సంవత్సరం జనవరి నుండి నూతన శఖానికి శంఖారావం పూరించినారు. అదే విధంగా రిటైర్డ్ మరియు పెన్షనర్స్  లో పొదుపు ప్రోత్సహించాలనే  సామాజిక స్పృహతో ఈ సంఘ కార్యకలాపాలు కొనసాగించుచున్నది.  సంఘ అభివృద్ధి కొరకు అచ్చంపేటలోనూ కొప్పవరం లోను వెంచర్లు చేసి సభ్యులకు అందజేయడం జరిగినది.  కేవలం ఆర్థిక పరిస్థితే  ధ్యేయంగా కాక సామాజిక స్పృహతో ఈ సంఘ సభ్యుల మధ్య మరియు పట్టణ ప్రజల మధ్య సుస్థిరమైన స్థానాన్ని సంపాదించి వారి యొక్క విశ్వాసాన్ని చవిచూచి సంఘము దినదినాభివృద్ధి చెందుతూ సుమారు 90 కోట్ల రూపాయలు డిపాజిట్లు కలిగి సుమారు 73 కోట్ల రూపాయిలు గృహ నిర్మాణాలకు  రుణాలు మంజూరు చేసి అగ్రగామిగా నిలదొక్కుకుంటున్న తరుణంలో ఏప్రిల్ 2011లో “ట్రెండ్ సెట్టర్”  శ్రీ కోసూరి యదు సూర్య  గారు ఆకస్మిక మరణం సంఘమునకు అశనిపాతం లాంటిది. 

 స్వర్గీయ శ్రీ కోసూరి యదు సూర్య గారి  మరణానంతరం వారి కుమార్తె  అధ్యక్షురాలుగా శ్రీమతి కోసూరి చిలక వీర రాఘవి  గారు సంఘ పటిష్టతను చేకూర్చే విధంగా సభ్యుల అవసరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని దానికి అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దుట జరిపినారు. వీరి పదవి కాలంలో డిపాజిట్లను 250 కోట్లకు పెంచుటలోనూ రుణములను 195 కోట్లకు పెంపొందింపజేయటలోను   కృషి సలిపినారు అనుటలో   అతిశయోక్తి లేదు.

తదుపరి 2016 మరియు 2021 సంవత్సరములలో సంఘానికి జరిగిన ఎలక్షన్లలో శ్రీ కోసూరి శ్రీనివాస సత్యనారాయణమూర్తి గారు సంఘ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినారు అని తెలియజేయుటకు ఎంతగానో సంతోషించుచున్నాము.  దివి 31-3-2023 నాటికి సంఘ డిపాజిట్లను సుమారు 339 కోట్లకు, షేరు  ధనము  సుమారు 11 కోట్లు, ఋణములు  సుమారు 213 కోట్లకు, ఫిక్స్ డ్  ఎసెట్స్  సుమారు 79 కోట్లు, అత్యవసర సమయములో వాడుకొనుటకు వీలుగా వివిధ భ్యాంకులలో డిపాజిట్లు  రూపంలో సుమారు 37 కోట్లు, కరెంటు అస్సెట్స్  రూపంలో సుమారు 91 కోట్లు కలిగి ఉండి మొత్తం మీద సుమారు 364 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రూపంలో ఏర్పాట్లు  గావించుటలో  వీరి కృషి అనన్య సామాన్యమైనది.  2022-23 సంవత్సరమునకు గాను విడుదల కాబడిన  ఆడిట్ రిపోర్ట్ ప్రకారం సుమారు 1.75 కోట్ల నికర లాభం సంఘం అర్జించినది అని విన్నవించుకొనుచు గడిచిన                                   20 సంవత్సరాలు పైబడి సంఘం లాభాల దిశలో పయనించుచూ సభ్యులకు డివిడెండ్లు పంపిణీ చేయుట జరుగుతున్నది. 

 సంఘం సభ్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సంఘ సొంతభవనములో ఉమ్మడి తూర్పుగోదావరి  జిల్లాలో సహకార వ్యవస్థకే  తలమానికంగా అప్పటి జిల్లా సహకార శాఖ అధికారిని శ్రీమతి T. ప్రవీణ గారి అమృత హస్తాలతో ఏటీఎం ను సొంతంగా నెలకొల్పడం జరిగింది. సత్వరం సభ్యుల సేవలు నిర్వర్తించుటకు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ జరుపబడినది అని తెలియజేయుచున్నాము . 

సహకార వారోత్సవాల్లో భాగంగా స్కూలు విద్యార్థిని, విద్యార్థులకు డ్రాయింగ్, వక్తృత్వపు మరియు వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతి ప్రధానం గావించుట, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనూ మరియు మహర్షి బులుసు సాంబమూర్తి పాఠశాలలోని అనాధ బాల బాలికలకు పుస్తకాల పంపిణీ, శీతోష్ణస్థితిని తట్టుకోనుటకు గాను దుప్పట్లు పంపిణీ మరియు Helpage వంటి సంస్థలకు ఆర్థిక సహాయము మరియు వృద్ధాశ్రమంలోని వారికి చేయూతగా నిత్యవసర వస్తువుల పంపిణీ మరియు Air Cooler, Gas Stove వంటి పరికరాలను పంపిణీచేయుట, కరోనాకాలంలో అనగా 2021 మరియు 2022 సంవత్సరములు మినహాయించి అన్ని సంవత్సరములలో సంఘ ప్రధాన కార్యాలయంలో “రోటరీ క్లబ్” వారి సౌజన్యంతో రక్తదాన శిబిరములు  నిర్వహించుట మరియు కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో సభ్యులకు ఉచిత నేత్ర వైద్య శిబిరం మరియు ట్రస్ట్ హాస్పిటల్ వారి సహృదయతతో  ఉచిత వైద్య శిబిరం నిర్వహించుట 2013లో “ఉత్తరాఖండ్”లో సంభవించిన వరద ప్రభావాలకు జనజీవనం అతలాకుతలమైన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి “రిలీఫ్ ఫండ్” గా ఆర్థిక సహాయం చేయుట మరియు 2014లో సంవత్సరంలో విశాఖ జిల్లాకు సంభవించిన హుద్ హుద్ తుఫానుకు  విలవిలలాడిన ప్రజానీకానికి బాసటగా  ముఖ్యమంత్రి సహాయనిధికి అప్పటి  ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారి చేతుల మీదుగా సంఘ సభ్యులు, పాలకవర్గ  సభ్యులు, సూపర్వైజర్ కౌన్సిల్ సభ్యులు, సంఘ సిబ్బంది నుండి వసూలు చేసిన మొత్తానికి సంఘ సాముదాయిక నిధులునుండి  కొంత మొత్తం జోడించి సుమారు రూ. 2,22,222/-  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కును ప్రధానం చేయుట జరిగినది ఇటువంటి కార్యక్రమాలను సహకార సూత్రాల్లో పొందుపరిచిన విధంగా “సమాజ శ్రేయస్సు” Concern for Community దృష్ట్యా నిర్వర్తించడం జరుగుతున్నదని విన్నవించుకొనుచున్నాము 

ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ నుండి రెండు ధపాలు  ఉత్తమ సొసైటీగా అవార్డు పొందిన సంస్థ మరియు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ నుండి గృహ నిర్మాణ సంఘాల్లో ఉత్తమ సంఘముగా ఎంపిక కాబడినది  మరియు “ఎకనామిక్ గ్రోత్ ఫౌండేషన్”, న్యూఢిల్లీ నుండి సహకార సంఘాల్లో “ఎక్స్ లెన్స్”  అవార్డు పొందిన సంస్థ అని విన్నవించుకుంటున్నాము. 

 సభ్యులు అవసరాలకు అనుగుణంగా సంఘాన్ని అభివృద్ధి పధంలో నడిపించుటలో సంఘ అధ్యక్షులు శ్రీ కోసూరి శ్రీనివాస సత్యనారాయణ మూర్తి గారు మిగిలిన పాలకవర్గ  సభ్యులతోనూ,  సూపర్వైజర్ కౌన్సిల్ సభ్యులతోనూ, అధికార, అనధికారులతోనూ సంఘ సిబ్బందితో మమేకమై చక్కని సమన్వయంతో కాలానుగుణంగా సత్వర నిర్ణయాలు అమలు చేయుచు రాష్ట్రస్థాయిలోనే కాక దేశ  చరిత్రలోనే సహకార గృహ నిర్మాణ సంఘాలకే తలమానికంగా తీర్చిదిద్దుతూ ప్రధాన కార్యాలయం మూడు అంతస్తులు సొంతభవనంలో కార్యక్రమాలు సాగించుచుండగా  సర్పవరం మరియు అన్నమ్మ గాటి  సెంటర్లలో రెండు బ్రాంచ్ కార్యాలయములు  ద్వారా ఇరు ప్రాంతాలలో  ఉండే సభ్యులకు అనువుగా నెలకొల్పి నోట్ల రద్దు  సమయంలో గాని, కోవిడ్-19 కాలంలో గాని ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ధీటుగా ఎదుర్కొనుచు మరియు కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా నడిపించుటలో ఎంతయో కృషి జరుపుతున్నారు అని సవినయంగా విన్నవించుకొనుచున్నాము. 

  సంస్థ ఏర్పాటు చేసి 100వ సంవత్సరంలు పూర్తి చేసుకొని 101వ సవత్సరంలో అడుగిడుతున్న ఈ శుభసందర్భంలో మీ అందరి ఆదరాభిమానములే సంఘ  పురోభివృధికి  మైలురాయిగా భావిస్తూ  ఇదే స్పూర్తితో సభ్యులు అందరు “సంఘంమనది” అనే  ద్యేయంతో వ్యవహరించుచూ సంఘాన్ని మరింతగా ముందుకు నడిపించుటకు  మీ వంతు సహాయ సహకారములే  మాకు “శ్రీ రామరక్ష” అని  విన్నవించుకొనుచూ భావితరాలవారుకూడా దీని ఫలాలను అనుభవించే రీతిలో కృషిసలుపుటలో మీ వంతు కృషిని వినయపూర్వకంగా అభ్యర్దించుచూ,  భారత ప్రభుత్వం స్వాతంత్రము వచ్చి 75 సంవత్సరాలు  పూర్తి అయిన  ఈ  వజ్రోత్సవవేళ  “ఆజాదీకా  అమృత్ మహోత్సవ ” గా జరుపుకున్న ఈ తరుణంలో సంఘము శతవసంతాల శతాబ్ది వేడుకలు జరుపుకొనుటలో “ఎందరో మహానుభావులు అందరికి వందనాలు” తెలియచేయుచూ ప్రముఖంగా స్వర్గీయ శ్రీ కోసూరి  కృష్ణారావు గారు మరియు శ్రీ కోసూరి యదు సూర్య గార్లు  తుది శ్వాస విడిచేవరకు ఆహర్నిశలు సంఘ పురోభివృద్దే  ద్యేయంగా పనిచేసినవారి మాట, బాట మరియు వారి నిర్ధేశించిన దశదిశ నిర్ధేశ్యమే లక్ష్యంగా పనిచేయుట ముదావహము అనితెలియచేసుకుంటున్నాము. 

ఈ సందర్భంగా సంస్థ యొక్క అభివృద్ధికి  తోడ్పడే విధంగా ఎంతో కాలంగా డిపాజిట్లు కొనసాగిస్తూ మరియు సంస్థ నుండి తీసుకున్న రుణములను సక్రమంగా చెల్లిస్తూ మన సొసైటీ  యొక్క  కార్యకలాపాలలో ముఖ్యపాత్ర పోషిస్తున్నా సభ్యులందరికి ధన్యవాదాలు తెలియచేయుచున్నాము. సంఘ శతాబ్ధి సంవత్సరమును పురస్కరించుకొని 2022 అక్టోబర్ నెల నుండి ఒక్కొక్క మాసంలో సభ్యుల సమాజ శ్రేయస్సును దృష్ట్యా  ఈ క్రింది కార్యక్రమములను నిర్వ ర్తించుట జరిగింది అని తెలియచేయుచున్నాము 

అక్టోబర్ నెల 2022 తేదీన సంఘానికి కృష్ణారావు గారి తరం నుండి నేటి వరకు సంఘ కార్యకలాపములను కొనసాగిస్తూ మమ్ములను ప్రోత్సహిస్తున్న సుమారు 10 మంది సభ్యులను ఎంపిక చేసి వారి ద్వారా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము గావించి, తగిన రీతిలో మంగళవాయిద్యాల నడుమ సత్కరించి వేదపండితులచే వేదఆశీర్వచనం గావిస్తూ శ్రీకారం చుట్టుట జరిగినది అని తెలుపుటకు  సంతోషించుచున్నాము

నవంబరు నెల 2022 కార్యక్రమం లో సహకార వారోత్సవాలను దృష్టి యందు ఉంచుకొని భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ పుట్టినరోజు పిల్లలకు పండుగ రోజుగా భావిస్తూ పంచవర్ష ప్రణాళికల ద్వారా సహకర రంగంతో దేశ అభివృద్ధి ముడిపడి ఉన్నదని భావించిన స్ఫూర్తితో 6 తరగతి నుండి10 తరగతి వరకు చదువు కొనసాగించుచున్న విద్యార్థిని విద్యార్థులకు డ్రాయింగ్, వకృత్వం మరియు వ్యాసరచన పోటీలు, జూనియర్స్ మరియు సీనియర్స్ విభాగాలలో నిర్వహించగా ఊహించని విధంగా వివిధ స్కూలు యాజమాన్యములు మరియు ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు పోటీలో పాల్గొనడం జరిగింది. ఆయా క్యాటగిరిలో వివిధ విభాగాల నుండి ప్రధమ, ద్వితీయ, తృతీయ శ్రేణులలో బహుమతి ప్రధానం సహకార వారోత్సవాల్లో నాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ శ్రీ ఆకుల వీర్రాజు గారు బ్యాంక్ సీఈఓ మరియు ఏపీ స్టేట్ కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ విద్యాధి కారైన శ్రీ ఆదిమూలం వెంకటేశ్వరరావు గార్ల సువర్ణ హస్తాలు మీదుగా బహుమతి ప్రధానం గావించుట జరిగింది. అంతేకాక “అక్షయ పాత్ర” ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సుమారు 500 మందికి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగులకు, వారి బంధువులకు ఆహార వితరణ జరిపినామని తెలియజేయుచున్నాము. 

 డిసెంబర్ నెల2022 కార్యక్రమంలో భాగంగా “మెడికవర్” గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, కాకినాడ వారి ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్ మరియు చెవి, ముక్కు గొంతు(ENT) విభాగాలకు చెందిన వైద్య నిపుణుల పర్యవేక్షణలో మెడికల్ క్యాంపు సభ్యులకు నిర్వహించుట జరిగింది.

         జనవరి నెల 2023  కార్యక్రమంలో భాగంగా శ్రీ ధన్వి డెంటల్ క్లినిక్, గుంటూరు మరియు సమీక్షా డెంటల్ క్లినిక్, కాకినాడ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా డెంటల్ క్యాంపు సభ్యులకు నిర్వహించడమైనది 

         ఫిబ్రవరి నెల 2023 కార్యక్రమంలో భాగంగా మాజీ అధ్యక్షులు స్వర్గీయ శ్రీ కోసూరి యదు సూర్య గారి జన్మదినోత్సవము పురస్కరించుకొని “రోటరీ క్లబ్” వారి సౌజన్యంతో రక్తదాన శిబిరము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఊహించని రీతిలో అత్యధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొని విజయవంతం గావించినారు

         మార్చి  నెల 2023 కార్యక్రమంలో భాగంగా సర్వసభ్య సమావేశము (జనరల్ బాడీ మీటింగ్) ఏర్పాటు చేయడమైనది అని విన్నవించుకుంటున్నాము

ఏప్రిల్ నెల 2023 కార్యక్రమంగా “ట్రస్ట్ హాస్పిటల్” కాకినాడ వారి సౌజన్యంతో కార్డియాలజీ మరియు అప్తాల్మాలజీ విభాగములకు చెందిన ప్రముఖ డాక్టర్ల పర్యవేక్షణలో సభ్యులకు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది

మే నెల 2023 కార్యక్రమముగా సంఘానికి మొదటిసారిగా జరిగిన ఎలక్షన్లలో ఘన విజయం సాధించి 1950వ సంవత్సరంలో తొలి అధ్యక్షునిగా ఎన్నిక కాబడి సుమారు 45 సంవత్సరముల సుదీర్ఘకాలం ఏకగ్రీవం కాబడుతూ సంఘానికి దిశా నిర్దేశం గావించి, సొంత భవనాన్ని ఏర్పాటుగావించి, ఏపీ స్టేట్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ ఏర్పాటులో కీలక భూమిక పోషించి తదుపరి ఆ సంస్థకు కూడా వైస్ చైర్మన్ గా ఎంపిక కాబడిన స్వర్గీయ శ్రీ కోసూరి కృష్ణారావు గారి కాంస్య విగ్రహ ప్రతిష్ట సంఘ భవనంలో ఏర్పాటు చేయడమైనది తెలియచేయుటకు ఎంతయో సంతోషించుచున్నాము. 

జూన్ నెల 2023 కార్యక్రమంలో భాగంగా సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉండి చదువు కొనసాగించుచున్న విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల పున:ప్రారంభాన్ని దృష్టి యందు ఉంచుకొని వారికి కావలసిన నోటు పుస్తకములు, కలములు, పెన్సిల్స్ వంటి వితరణ కార్యక్రమము నిర్వహించుట జరిగినది

జూలై నెల 2023 కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలోని “అపోలో” హాస్పిటల్ మరియు “సిద్ధార్థ” హాస్పిటల్ లో గల ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో “యూరాలజీ” విభాగానికి చెందిన మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది అని తెలియజేయుచున్నాము

ఆగస్టు నెల 2023 లో “స్టార్ హెల్త్” ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి సౌజన్యంతో “మెడికవర్” గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి చెందిన ప్రముఖ వైద్య నిపుణుల పర్యవేక్షణలో జనరల్ మెడిసిన్ మరియు ఆర్థోపెడిక్ విభాగములకు సంబంధించిన మెడికల్ క్యాంపు సభ్యులు నిమిత్తం ఏర్పాటుచేయుట జరిగింది

సెప్టెంబర్ నెల 2023లో “పవర” గ్రామంలో గల “ట్రినిటీగ్రూప్” ఆఫ్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో “ఆంకాలజీ” మరియు “పల్మానాలజీ” విభాగములకు చెందిన ప్రముఖ డాక్టర్లతో అవగాహన సదస్సుతో కూడిన మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది తెలియజేయుటకు ఎంతయోసంతోషించుచున్నాము

“ఆరోగ్యమే మహాభాగ్యము” అని నానుడి అనుసరించి సంఘ సభ్యులలో అధిక శాతము సీనియర్ సిటిజన్స్ ఉండుటచే ఈ వందవ సంవత్సరంలో అధిక భాగము అన్ని విభాగములకు చెందిన మెడికల్ క్యాంపులు నిర్వహించగా అందుకు ధీటుగా సభ్యులు కూడా ముందుకు వచ్చి ఈ మెడికల్ క్యాంపులను0సద్వినియోగపరచుకొనుట జరిగినది ఇందుకు సహాయ సహకారములు అందించిన హాస్పిటల్స్ యాజమాన్యం వారికి డాక్టర్ల బృందములకు మరియు ఇతర నర్సింగ్ సిబ్బందికి మరొకసారి ధన్యవాదములు సభాముఖంగా తెలియచేసుకొనుచున్నాము.

.

Comments are closed.